అగ్నిప్రమాదంలో ఎద్దు మృతి.. పశువుల కొట్టం దగ్ధం

సిరికొండ, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం జంగిలోడి తండాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో భూక్య రాములుకు చెందిన పశువుల కొట్టం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒక ఎద్దు మంటల్లో చిక్కుకుని మృతి చెందగా, మరో ఎద్దు బయటకు తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ప్రమాదంతో పశువుల కొట్టం పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఇటీవల అటవీ శాఖ అధికారులు ఆక్రమిత అటవీ భూముల చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో, అధికారులకు సమాచారం ఇచ్చారనే అనుమానంతో గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పశువుల కొట్టానికి నిప్పుపెట్టి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో సహజసిద్ధంగా అగ్నిప్రమాదం సంభవించే అవకాశం తక్కువేనని వారు పేర్కొంటున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.