కౌలు రైతులకు రుణాలే ప్రాధాన్యం..
కౌలు రైతులకు రుణాలే ప్రాధాన్యం..
బ్యాంకర్లకు కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టమైన ఆదేశాలు
ఏలూరు, ఆంధ్రప్రభ : జిల్లాలో రుణ అర్హత కార్డులు కలిగిన ప్రతి కౌలు రైతుకు సాగు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లను ఆదేశించారు. రైతులు, ఎంఎస్‌ఎంఈలు, విద్యా రుణాలు, ముద్రా రుణాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో కలెక్టర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 65 వేల మందికి పైగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేసినప్పటికీ, కేవలం 23 వేల మంది రైతులకు మాత్రమే రుణాలు మంజూరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.375 కోట్ల రుణాల లక్ష్యానికి గాను కేవలం రూ.124 కోట్లే మంజూరు కావడం బ్యాంకుల పనితీరును ప్రతిబింబిస్తోందన్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సాగులో 90 శాతానికి పైగా ఉన్న కౌలు రైతులకు పరపతి సౌకర్యాలు విస్తృతంగా అందించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందన్నారు. కౌలు రైతులకు పంట రుణాల మంజూరులో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.
గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,845 కోట్ల రుణాల లక్ష్యానికి గాను రూ.18,065 కోట్ల రుణాలు అందించి లక్ష్యాలను మించి సాధించినట్లు తెలిపారు. అయితే ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.3,343 కోట్ల లక్ష్యానికి గాను కేవలం రూ.2,762 కోట్ల రుణాలే మంజూరు కావడం ఆందోళనకరమన్నారు. లక్ష్యాలను చేరుకోని బ్యాంకులు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రుణ అర్హత కలిగిన రైతులు, పాడి రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో బ్యాంకర్లు, అధికారులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
జిల్లాలో పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్న కలెక్టర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన రుణాలను ప్రాధాన్యంతో మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి వాటి ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు.
సైబర్ మోసాలపై 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు అవగాహన కల్పించాలి
సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాలపై గ్రామస్థాయిలో రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సైబర్ మోసానికి గురై డబ్బులు కోల్పోయిన వారు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
పంట, పశు బీమాపై ప్రత్యేక దృష్టి
పంట బీమా, పశు బీమా పథకాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, బీమా ప్రీమియాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతుల ఆర్థిక భద్రత కోసం బీమా పథకాలు కీలకమని పేర్కొన్నారు.
సమావేశంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ సత్యనారాయణరెడ్డి, ఆర్బీఐ ప్రతినిధి డి. కిరణ్ కుమార్, ఎల్డీఎం నీలాద్రి, నాబార్డ్ డీసీఎం అనిల్ కాంత్, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జీఎం వెంకటరావు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
