నీటి ఎద్దడిపై ప్రజాప్రతినిధుల ఆవేదన
నీటి ఎద్దడిపై ప్రజాప్రతినిధుల ఆవేదన
ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సూచన
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లాలో తాగునీటి సమస్యలు, విద్యుత్ భద్రత, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సూచించారు.
బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, విద్యాశాఖ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మదర్ వాటర్ ప్లాంట్లు, ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ప్లాంట్లను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 167కే రహదారి నిర్మాణంలో భాగంగా పైప్లైన్ల తొలగింపుకు ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని, వాటిని వెంటనే సరిచేసి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం సకాలంలో అందించాలని, శాఖలో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని, పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు కోసం అమలు చేస్తున్న ప్రత్యేక కార్యాచరణకు మరింత ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
సభ్యులు లేవనెత్తిన సమస్యలపై కలెక్టర్ స్పందన
సమావేశంలో సభ్యులు లేవనెత్తిన పలు సమస్యలు, అభ్యర్థనలపై జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్పందించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వ్యవసాయ శాఖకు సంబంధించి జిల్లాలో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఈ-క్రాప్ నమోదైన ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. పంట మార్పిడి చేసిన రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
దొర్నిపాడు మండలంలో శిథిలావస్థకు చేరిన ఓవర్హెడ్ ట్యాంకు విషయంలో భద్రతా చర్యలు చేపట్టి, ప్రమాద హెచ్చరిక బోర్డులు, కంచె ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్తపల్లి మండలంలో 167కే రహదారి నిర్మాణంలో భాగంగా రైతుల భూముల నుంచి మట్టి తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గడివేముల మండలం సోమాపురంలో ఇళ్లపైకి దిగువకు వచ్చిన విద్యుత్ తీగల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను పంపించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
అలాగే గువ్వలకుంట్ల–చిన్నపాలెం–సదరంచెరువు–ఎర్రగుడి చెరువు రహదారి పనులను వేగవంతం చేయాలని, ఆత్మకూరు నుంచి గువ్వలకుంట్ల వరకు విద్యార్థుల రాకపోకల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
