విద్యుద్ఘాతంతో వ్యక్తి మృతి…

బయ్యారం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ స్థంభంపైకి ఎక్కి కనెక్షన్ పరిశీలిస్తున్న వ్యక్తి విద్యుద్ఘాతానికి గురై మృతిచెందాడు.

స్థానికుల వివరాల ప్రకారం, గంధంపల్లి గ్రామానికి చెందిన మాచర్ల శ్రీను గతంలో విద్యుత్ శాఖలో రోజువారీ వేతనంపై పనిచేసినట్లు తెలిసింది. పరిచయస్తుడైన కుమారస్వామి తన పొలం వద్ద ఉన్న మోటార్‌కు విద్యుత్ సరఫరా రావడం లేదని చెప్పడంతో శ్రీను అక్కడికి వెళ్లాడు.

సమీపంలోని డిస్ట్రిబ్యూషన్ బాక్స్ వద్ద కనెక్షన్‌ను పరిశీలించినట్లు సమాచారం. అప్పటికే విద్యుత్ శాఖ సిబ్బంది వేరే ప్రాంతంలో పనుల నిమిత్తం ఫ్యూజులు తొలగించి ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.

శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా కనెక్షన్ ఇవ్వొచ్చని భావించి శ్రీను విద్యుత్ స్థంభంపైకి ఎక్కినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పనులు ముగించుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించడంతో శ్రీను తీవ్ర విద్యుద్ఘాతానికి గురై తీగలపైనే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.

Leave a Reply