అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

  • బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి

రేగొండ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 23న నిర్వహించనున్న “చలో అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చినట్లు జిల్లా ఉపాధ్యక్షులు. దాసరి తిరుపతిరెడ్డి తెలిపారు.రేగొండ మండల కేంద్రంలో ఆయన ప్రెస్ నోట్ విడుదల చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.

రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ, యువతకు నిరుద్యోగ భృతి ఉద్యోగావకాశాలు, మహిళలకు భద్రత మరియు సంక్షేమ పథకాలు వంటి అనేక హామీలను ప్రకటించినప్పటికీ, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.అదేవిధంగా ఎన్నికల సమయంలోప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

పెన్షన్లు పెంచుతామని చెప్పి మాట తప్పిందని, రైతులకు ఎకరానికి ₹6,000 చొప్పున మూడు విడతల్లో ఇవ్వాల్సిన మొత్తం ₹18,000 రైతు భరోసా డబ్బును ఇప్పటి వరకు విడుదల చేయకుండా ఎగ్గొట్టిందని తీవ్రంగా విమర్శించారు. వెంటనే రైతుల ఖాతాల్లో ఈ ₹18,000 జమ చేయాలని డిమాండ్ చేశారు.
యువతకు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని, పెళ్లయిన అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చినా వాటిని అమలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.

ఈ హామీలను నిలబెట్టుకోలేకపోయిన ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు.నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడంతో యువత భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు.ప్రజల హక్కులను కాపాడటానికి, ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికే “చలో అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రేగొండ మండలానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.