Eatala Rajender | తప్పుడు ప్రచారం చేయొద్దు

Eatala Rajender | తప్పుడు ప్రచారం చేయొద్దు
Eatala Rajender | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బీజేపీని వీడి ఇతర పార్టీలోకి చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నానని ‘పిచ్చి ప్రచారాలుస చేయొద్దని మండిపడ్డారు. తాను, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీ మారుతున్నామన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. పార్టీ మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదని.. తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.తాను పదవుల కోసం పద్దులు మోసే వ్యక్తిని కాదని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ అప్పట్లో తనను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని, ఆనాడు తన గోడు వినేవారే లేరని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ‘హైడ్రా’ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టడం అరాచకమని ధ్వజమెత్తారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని వెల్లడించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఇప్పటికే రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వంపై త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు
