భారత్‌తో జరగనున్న ప్రతిష్ఠాత్మక టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) తమ జట్టును ప్రకటించింది. గురువారం వెల్లడించిన ఈ 14 మంది సభ్యుల ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జామీ ఓవర్టన్ పునరాగమనం చేశాడు.
జూన్ 20 నుంచి లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో భారత్ – ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన సర్రే ఆటగాడు గస్ అట్కిన్సన్ స్థానంలో జామీ ఓవర్టన్‌ను ఎంపిక చేశారు. 31 ఏళ్ల ఓవర్టన్, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్లలో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఒకే ఒక టెస్టు ఆడాడు. తన ఏకైక టెస్టు మ్యాచ్‌ను 2022లో న్యూజిలాండ్‌పై ఆడాడు. ఆ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి, రెండు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
జట్టు కూర్పులో అనుభవజ్ఞులైన జో రూట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్ వంటి ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులైన షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్‌లకు కూడా చోటు కల్పించారు. దీంతో ఇంగ్లండ్ జట్టు యువత, అనుభవం కలగలిసిన సమతూకంతో బరిలోకి దిగనుంది.
21 ఏళ్ల జాకబ్ బెథెల్ తిరిగి జట్టులోకి రావడం బ్యాటింగ్ లైనప్‌కు మరింత బలాన్ని చేకూర్చనుంది. ఇటీవల ఐపీఎల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ సభ్యుడైన బెథెల్, న్యూజిలాండ్‌లో తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేసి మూడు అర్ధశతకాలతో 52 సగటుతో రాణించాడు. అతని రాకతో ఓలీ పోప్, జాక్ క్రాలీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇటీవలి జింబాబ్వే సిరీస్‌లో వీరిద్దరూ శతకాలు సాధించడం గమనార్హం.
పేస్ దళానికి క్రిస్ వోక్స్, జోష్ టంగ్ అండగా నిలవనుండగా, సామ్ కుక్, బ్రైడన్ కార్స్ అదనపు బౌలింగ్ ఆప్షన్లుగా అందుబాటులో ఉంటారు. క్రిస్ వోక్స్, కార్స్ ఇద్దరూ గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. మరోవైపు, ఈ పర్యటనలో భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్) షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.