నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ
నిర్మల్ రూరల్ (ఆంధ్రప్రభ): జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (ఎన్ఈసీసీ) ఆధ్వర్యంలో, నిర్మల్ పట్టణంలోని వశిష్ట విద్యాసంస్థలు, అభిరాం ఫ్యూయల్స్ సహకారంతో సోన్ మండలం కడ్తాల్‌లోని అభిరాం పెట్రోల్ బంక్ ఆవరణలో గురువారం నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు 20 తోపుడు బండ్లు, గ్యాస్ సిలిండర్లు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా వి. సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఉచితంగా అందించిన తోపుడు బండ్లను సద్వినియోగం చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గుడ్డు పోషకాహార విలువలను ప్రజలకు తెలియజేయాలని, పౌల్ట్రీ రైతుల సహకారంతో ఏర్పాటైన జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా పౌల్ట్రీ రంగ అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.
తోపుడు బండ్లు పొందిన లబ్ధిదారులు తమ జీవనోపాధికి తోడ్పాటు అందించిన జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ, వశిష్ట విద్యాసంస్థలు, వి. సత్యనారాయణ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంజులాపూర్ వైస్ చైర్మన్ బర్మ గంగాదాసు, మాజీ సర్పంచులు నవత్ గంగాధర్, శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు రమణ గౌడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
