E20 petrol | పెట్రోల్ ట్యాంకులో తేనటీగలు.. ఇథనాల్ పెట్రోల్‌పై కొత్త భయాలు!
E20 petrol | పెట్రోల్ ట్యాంకులో తేనటీగలు.. ఇథనాల్ పెట్రోల్‌పై కొత్త భయాలు!
E20 petrol |సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చీమలు–తేనెటీగల వీడియోలు
- మైలేజీ తగ్గుతుందా?..
- పాత వాహనాలకు ప్రమాదమా?..
- నిపుణులు ఏమంటున్నారు?
E20 petrol |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు E20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే, దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇంధన స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న వేళ, E20 పెట్రోల్‌పై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. కొందరు వాహనదారులు తమ బైక్‌లు, కార్ల పెట్రోల్ ట్యాంకుల చుట్టూ చీమలు, తేనెటీగలు చేరుతున్నాయని సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇథనాల్‌కు తీపి లక్షణాలు ఉండటంతోనే పురుగులు వస్తున్నాయి అనే ప్రచారం వైరల్ అవుతోంది. దీంతో E20 పెట్రోల్ నిజంగా సురక్షితమేనా? వాహనాలకు నష్టం జరుగుతోందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
E20 petrol |వైరల్ అవుతున్న వీడియోలు..
పెట్రోల్ ట్యాంక్ మూతల వద్ద చీమలు గుమికూడినట్లు, కొన్ని వాహనాల ఫ్యూయల్ ట్యాంక్ లోపల తేనెటీగలు తిరుగుతున్నట్లు చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటికి E20 పెట్రోల్ కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతోందనే విమర్శలు వినిపిస్తుండగా, ఇప్పుడు ఈ కొత్త ప్రచారం వాహనదారుల్లో మరిన్ని సందేహాలు పెంచుతోంది.
అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న… పెట్రోల్ ట్యాంకులో చీమలు, తేనటీగల వీడియోలకు E20 పెట్రోల్‌నే కారణమని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు లేవు. అవి ఏఐ వీడియోలు అని తెలుస్తుంది. అయినప్పటికీ, కొత్త ఇంధన విధానాల విజయానికి పారదర్శక సమాచారం, ప్రజల అవగాహన, సాంకేతిక స్పష్టత కీలకమనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
E20 petrol |ఇథనాల్ అంటే ఏంటి..
ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారు చేస్తారన్న కారణంతో చాలామంది అది తీపి పదార్థమని భావిస్తున్నారు. కానీ ఇంధనంగా ఉపయోగించే ఇథనాల్‌లో చీమలు లేదా తేనెటీగలను ఆకర్షించే చక్కెర ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పండ్లు పులిసినప్పుడు లేదా ఫ్లవర్ నెక్టార్ లో ఉండే సహజ ఇథనాల్‌కు, ఇంధన ఇథనాల్‌కు తేడా ఉంటుందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలను నేరుగా E20 పెట్రోల్‌తో ముడిపెట్టడం శాస్త్రీయంగా సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు.

E20 petrol |కేంద్రం వివరణ ఇదే..
E20 పెట్రోల్ వాడకం వల్ల ఇంజిన్లు పూర్తిగా దెబ్బతింటాయన్న వాదనలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఇప్పటికే ఖండించింది. నిర్వహించిన పరీక్షల్లో ఇంజిన్ పనితీరు, లోహాలు, ప్లాస్టిక్ భాగాలపై పెద్దగా ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని తెలిపింది. అయితే కొన్ని పాత వాహనాల్లో రబ్బర్ ట్యూబ్స్, గాస్కెట్లు సాధారణం కంటే త్వరగా అరిగే అవకాశం ఉందని కేంద్రం అంగీకరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రధాన ఇంధనం E20. ఇందులో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటుంది.
ఇటీవల ప్రవేశపెట్టిన E85 ఇంధనంలో మాత్రం 80 నుంచి 85 శాతం వరకు ఇథనాల్ ఉంటుంది. దీనిని సాధారణ బైక్‌లు, కార్లలో ఉపయోగించరాదు. అధిక ఇథనాల్ మిశ్రమాలను వినియోగించగల ప్రత్యేక ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల్లోనే ఈ ఫ్యూయల్ వాడుతారు. సాధారణ వాహనాల ట్యాంకుల వద్ద కనిపించే చీమల వీడియోలను నేరుగా E85 ఇంధనంతో ముడిపెట్టడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు.
E20 petrol |వాహన కంపెనీలు ఏమంటున్నాయి?
E20 వినియోగంతో మైలేజీ 2 నుంచి 4 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వాహన తయారీ సంస్థల సంఘం (SIAM) తెలిపింది. అయితే భద్రతాపరంగా పెద్ద సమస్య ఏదీ లేదని స్పష్టం చేసింది. బీమా, వారంటీపై కూడా ప్రభావం ఉండదని తెలిపింది. మహీంద్రా వంటి సంస్థలు కూడా E20 వినియోగం సురక్షితమేనని చెబుతున్నాయి. అయితే కొంతమంది వాహనదారులు మైలేజీ తగ్గడం, ఇంజిన్ నాకింగ్, పిక్-అప్ తగ్గడం వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు.
ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల దేశానికి చమురు దిగుమతుల భారం తగ్గుతుందని, రైతులకు లాభం కలుగుతుందని కేంద్రం చెబుతోంది. కానీ వాహన వినియోగదారులు మాత్రం తమ వాహనం E20కు పూర్తిగా అనుకూలమా? పాత వాహనాల్లో ఏ భాగాలు మార్చాల్సి వస్తుంది? అదనపు ఖర్చు ఎవరు భరిస్తారు? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
E20 అమలును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖాలైంది. అయితే, ఉన్నతన్యాయస్థానం ఆ పిటీషన్‌ను కొట్టివేసింది. ఇథనాల్ లేని పెట్రోల్‌ను ప్రత్యామ్నాయంగా అందించాలన్న డిమాండ్‌కు కూడా సుప్రీం అనుమతి ఇవ్వలేదు. ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు దేశ ఇంధన భద్రత, చమురు దిగుమతుల తగ్గింపు, రైతుల ఆదాయ పెంపు, కార్బన్ ఉద్గారాల నియంత్రణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
E20 petrol |నిజానిజాలు తెలుసుకోవాలి..
అయితే కొత్త ఇంధన విధానాలపై వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలను క్లియర్ చేయడం కూడా అంతే ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేవలం భయపడాల్సిన అవసరం లేదు… అని చెప్పడానికే పరిమితం కాకుండా, ఏ వాహనాలు E20 ఫ్యూయల్‌కు పూర్తిగా అనుకూలమో స్పష్టమైన జాబితాను విడుదల చేయాలని, పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ మిశ్రమ శాతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించడం, పాత వాహనాలకు అవసరమైన సాంకేతిక మార్పులపై మార్గదర్శకాలు జారీ చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వాహన వినియోగదారుల ఫిర్యాదులు, సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వల్ల కొన్ని వాహనాల్లో మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని, పాత మోడళ్లలో రబ్బర్ ట్యూబ్స్, గాస్కెట్లు వంటి కొన్ని భాగాలను సాధారణం కంటే ముందుగానే మార్చాల్సి రావచ్చని కేంద్ర ప్రభుత్వం, వాహన తయారీ సంస్థలు ఇప్పటికే అంగీకరించాయి. అయితే ఇథనాల్ కారణంగా చీమలు, తేనెటీగలు లేదా ఇతర కీటకాలు పెట్రోల్ ట్యాంకుల వద్దకు వస్తాయనే వాదనకు అధికారిక నిర్ధారణ లేదు.
అందువల్ల ఈ అంశంపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ జెనరేటెడ్ వీడియోలు, ఎడిట్ చేసిన దృశ్యాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. కొత్త ఇంధన విధానాలపై ప్రజల్లో అనవసర భయాలు, అపోహలు పెరగకుండా ఉండాలంటే శాస్త్రీయ ఆధారాలతో కూడిన స్పష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఎప్పటికప్పుడు అందించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

