రాజస్థాన్‌లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు సావిత్రమ్మ
ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో వెలుగుచూసిన దారుణమైన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిందని, ఈ ఘటనకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ నారాయణపేట జిల్లా నాయకురాలు సావిత్రమ్మ డిమాండ్ చేశారు.
శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శ్రీగంగానగర్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక తన స్నేహితురాలిని కలవడానికి వెళ్లిన సమయంలో ఓ ఈ-రిక్షా డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిపారు. అనంతరం ఆమెను వేర్వేరు ప్రాంతాలకు, ముఖ్యంగా స్థానిక హోటళ్లకు తరలించి సుమారు ఐదు రోజుల పాటు నిర్బంధించినట్లు చెప్పారు. ఈ సమయంలో దాదాపు 30 మందికి పైగా మృగాళ్లు ఆమెపై వరుసగా సామూహిక అత్యాచారానికి (గ్యాంగ్‌రేప్) పాల్పడడం అత్యంత క్రూరమైన చర్య అని అన్నారు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారైన ఈ-రిక్షా డ్రైవర్‌తో పాటు నిందితులకు సహకరించిన హోటల్ మేనేజర్లు, యజమానులను పోలీసులు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) జోక్యం చేసుకుని విచారణ జరిపి, నిందితులకు తగిన శిక్ష పడేలా అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. విచారణ అనంతరం నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా రాజస్థాన్ ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు దేశంలో అనేకంగా జరుగుతున్నప్పటికీ వాటికి పూర్తి పరిష్కారం చూపడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సమాజంలో వస్తున్న అనేక రుగ్మతలను అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శివలీల, బాబమ్మ, దేవమ్మ, వెంకటమ్మ, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.
