Sriharikota | భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం..

Sriharikota | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి తన లక్ష్యాన్ని చేరుకుంది.

‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో విక్రమ్-1 రాకెట్ తన పేలోడ్లను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. విక్రమ్-1 విజయవంతంగా ప్రయోగం పూర్తవడంతో స్కైరూట్ లాంచ్ కంట్రోల్ సెంటర్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్కైరూట్ శాస్త్రవేత్తలతో పాటు ఇస్రో అధికారులు, శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు.

ఇస్రో వేదికగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన రాకెట్ విజయవంతంగా ప్రయోగం కావడం భారత అంతరిక్ష రంగానికి చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఈ విజయంతో దేశంలో ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు మరింత ఊతం లభించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.