Mahbubnagar పాలమూరు వర్సిటీలో విషాదం.. విద్యార్థి బలవన్మరణం
Mahbubnagar పాలమూరు వర్సిటీలో విషాదం.. విద్యార్థి బలవన్మరణం
- హాస్టల్ గదిలో ఉరేసుకున్న ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి
- కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మహబూబ్‌నగర్ (Mahbubnagar), క్రైం, ఆంధ్రప్రభ:
పాలమూరు విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన టీ. కార్తీక్ (23) పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
తన కోర్సుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు సమర్పించేందుకు సోమవారం విశ్వవిద్యాలయానికి వచ్చిన కార్తీక్, మంగళవారం ఉదయం హాస్టల్ గదిలో ఉరేసుకుని కనిపించాడు. తోటి విద్యార్థులు గమనించి అధ్యాపకులకు సమాచారం అందించగా, వారు వెంటనే పోలీసులకు తెలియజేశారు.
అనంతరం కార్తీక్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
విద్యార్థి బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
