Double dhamaka | ఆ గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు!

Double dhamaka | ఆ గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు!
Double dhamaka | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద గ్రామాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. గ్రామపంచాయతీ నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు ఓటర్లు ఇక్కడ రెండు ఓట్లు వినియోగించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కొమరం భీం జిల్లా కెరమెరి మండలంలో తొలి విడత ఈ నెల 11న జరిగే పంచాయతీ పోలింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల (Election) సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. వివాదాస్పద గ్రామాలుగా ముద్రపడి, సరిహద్దు వివాదం తేలక ఇరు రాష్ట్రాల మధ్య నలుగుతున్న కెరమెరి మండలం పారండోలి, ముకద్దం గూడ, అంతపూర్, బోలా పటార్ గ్రామపంచాయతీలో సర్పంచ్, వార్డు స్థానాల కోసం అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. పరండోలి పంచాయతీ ఈ సారి జనరల్ రిజర్వేషన్ ఖరారు కావడంతో సర్పంచ్ బరిలో ఎనిమిది మంది పోటీ పడుతున్నారు.

ఇక ఆ గ్రామాలకు ఇద్దరు సర్పంచులు..
ఏ పంచాయతీకైనా ఒకే సర్పంచ్ ఉండడం సహజమే. కానీ ఆ నాలుగు గ్రామాల్లో ఇద్దరు సర్పంచులుంటారు. ఆ ఊళ్లలో ఓటర్లకు (Voters) ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు హక్కుతో పాటు, పోటీ చేసే అవకాశాలు కల్పించడంతో డబుల్ ధమాకా రేసులో నేతలు ఉత్సాహంగా ప్రతి ఎన్నికల్లో పోటీపడతారు. కుమురం భీం జిల్లా కెరమెరి మండలంల పరందొలి, ముకదమ్గూడ, అంతాపూర్, బోలాపటార్ పంచాయతీల పరిధిలోని 15 సరిహద్దు వివాదాస్పద గ్రామాల్లో ఈ వింత పరిస్థితి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
సుప్రీంకోర్టు సూచన మేరకే ఎన్నికలు..
భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన సమయంలో ఈ గ్రామాల పంచాయతీ తేలక పోవడంతో రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద గ్రామాల్లో ఇద్దరు సర్పంచులు, ఇద్దరు వార్డు మెంబర్లు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుప్రీంకోర్టు (Suprime court) సూచన మేరకు సరిహద్దు వివాదం పరిష్కారమయ్యేవరకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అన్ని ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు వేసేలా దశాబ్దాల కిందటే అవకాశం కల్పించారు. ఆ మేరకు వారికి రెండు రాష్ట్రాల ఓటరు కార్డులుంటాయి. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో 11వ తేదీన పోలింగ్ జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తొలి విడత ఎన్నికలతో వేడెక్కిన పంచాయతీలు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కెరమెరి మండలం పరండోలి పంచాయతీ జనరల్ స్థానానికి రిజర్వు కాగా ఇక్కడ ఎనిమిది మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అంతాపూర్ సర్పంచ్ పదవి జనరల్ కేటగిరీలో ఆరుగురు అభ్యర్థులు పోటీ (Competition) పడుతుండగా, బోలా పటార్ సర్పంచ్ స్థానానికి ముగ్గురు, ముఖద్దం గూడా సర్పంచ్ పదవికి ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగుతోంది. ఇక్కడ పాత మాజీ సర్పంచులు సుంగె బాలాజీ, పతంగి లింబాద్రి, ఉపసర్పంచ్ ఆడే గున్వంత్ మరోసారి పోటీకి తలపడుతున్నారు. దీంతో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నాలుగు పంచాయతీల పరిధిలో మొత్తం 3,456 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక్కడ ఓడిపోయినా… మహారాష్ట్ర ఎన్నికలకు రెడీ..!
తొలి విడత జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఒకవేళ అభ్యర్థులు ఓడిపోతే మరోసారి వచ్చే ఫిబ్రవరిలో జరిగే మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లోను అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థులు.. సుమారు మూడు నెలల తర్వాత రాబోయే మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఏదిఏమైనా ప్రభుత్వ పథకాలను రెండు చోట్ల వినియోగించుకుంటూ ఓటర్లు రెండు ఓట్లతో ఇరు రాష్ట్రాల ప్రజాప్రతితులను ఎన్నుకోవడం గమ్మత్తయిన విషయంగా చెప్పుకుంటారు. అంతేగాక మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాలకు (GOVT) సంబంధించి రెండు పాఠశాలలు, రెండు పంచాయతీలు, రెండు వాటర్ ట్యాంకులు, అంగన్వాడీలు సకల వసతులతో ఇక్కడ కనిపిస్తాయి. ఇరు రాష్ట్రాల రేషన్ కూడా ఇక్కడి ప్రజలు పొందుతూ డబుల్ ధమాకా అవకాశం దక్కించుకుంటున్నారు.

