పల్స్ పోలియోలో ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చుక్కలు వేయించాలి
- మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మేడ్చల్, ఆంధ్రప్రభ : చిన్నారుల భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ మేడ్చల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆదివారం రోజు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన చిన్న పిల్లలకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. పోలియో అనేది చిన్న పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి ఒకసారి వస్తే జీవితాంతం వికలాంగత్వానికి దారి తీస్తుందని, దురదృష్టవశాత్తు దీనికి పూర్తి చికిత్స లేదని పేర్కొన్నారు. అయితే, ముందస్తు నివారణ మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉందన్న ఆయన.. అదే పోలియో చుక్కలు అని స్పష్టం చేశారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి, ప్రతి పల్స్ పోలియో రౌండ్‌లోనూ పోలియో చుక్కలు వేయించడం చాలా అవసరం.
గతంలో ఇప్పటికే వేయించినప్పటికీ, ప్రతి రౌండ్‌లో మళ్లీ మళ్లీ వేయించాలి. ఇది పూర్తిగా సురక్షితం మరియు ఉచితం అని వివరించారు. తల్లి దండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ.. పోలియో చుక్కలపై ఎలాంటి అపోహలను నమ్మవద్దని, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తప్పకుండా పోలియో చుక్కలు వేయించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని మల్లారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ భాస్కర్ యాదవ్, మాజీ కోఆప్షన్ మెంబర్ ఆకిటి నవీన్ రెడ్డి, నడిగొప్పు నాగరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్య అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
