మూఢనమ్మకాలు, భూతగాదాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు

  • హుజూర్నగర్ సీఐ చరమందరాజు

గరిడేపల్లి, ఆంధ్రప్రభ: ప్రజలు భూతగాదాలు, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు పేర్కొన్నారు . జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి బుధవారం రాత్రి నిర్వహిస్తున్న ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమంలో భాగంగా, గరిడేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పోనుగోడు గ్రామంలో సామాజిక అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఐ చరమందరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

​సైన్స్ యుగంలో మూఢనమ్మకాలా….

నేటి ఆధునిక సమాజం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ముందుకు దూసుకుపోతోందని, ఇలాంటి రోజుల్లో ఇంకా బాణామతి, చేతబడులు, మంత్రాలు, తంత్రాలు అంటూ నమ్మడం అవివేకమని కొట్టిపారేశారు. సమాజంలో అలాంటివి ఏమీ లేవని, కేవలం భ్రమలతో కొందరు గొడవలకు దిగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో యువత, పౌరులు సత్ప్రవర్తనతో మెలగాలని, నేర రహిత సమాజ స్థాపనకు పోలీసులకు సహకరించాలని కోరారు.

​గట్ల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి

ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున పొలాల వద్ద గట్ల తగాదాలు, స్థల వివాదాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే గ్రామంలో పెద్దల సమక్షంలో లేదా చట్టబద్ధంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప, భౌతిక దాడులకు పాల్పడకూడదని హెచ్చరించారు. గతంలో పోనుగోడు గ్రామంలో జరిగిన ఒక భూ పంచాయితీ కారణంగానే నలుగురు వ్యక్తులకు కోర్టు జీవిత ఖైదు విధించిన చేదు నిజాన్ని ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు గుర్తు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కటకం వేణు ఉపసర్పంచ్ అరవింద్ రెడ్డి మాజీ బీఎస్సీ చైర్మన్ కటకం లక్ష్మీనారాయణ ఖడ్గం రమేష్ చామకూరి గురుస్వామి ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది మరియు పోనుగోడు గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.