మాట్లాడుకుందామని పిలిచి దాడి
వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ మండలం కొట్టం గుట్ట తండాకు చెందిన కె. సంతోష్‌పై మాట్లాడుకుందామని పిలిచి దాడి చేసిన ఘటన వికారాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్, అతని సోదరుడు శ్రీకాంత్ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా శ్రీకాంత్, సంతోష్‌ను ఇంట్లోకి రానివ్వకుండా గొడవలకు దిగుతున్నట్లు ఆరోపించారు.
ఈ సమస్యపై మాట్లాడుకుందామని చెప్పి శ్రీకాంత్ గాంధీ పార్కుకు రావాలని సంతోష్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో సంతోష్ తన భార్య, పిల్లలతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న శ్రీకాంత్, అతని బంధువులు ఒక్కసారిగా సంతోష్, అతని భార్యపై దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనలో వారి చిన్నారి కూడా గాయపడినట్లు తెలిపాడు.
దాడిలో తీవ్రంగా గాయపడిన సంతోష్ అపస్మారక స్థితికి చేరుకోగా, దాడి చేసిన వారు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనపై కె. సంతోష్ వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాట్లాడుకుందామని పిలిచి తమపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
