ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

  • ఆర్డీవో గణేష్

తొర్రూరు,ఆంధ్రప్రభ: ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని తొర్రూరు ఆర్డీవో గణేష్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కొనసాగిన ప్రజావాణిలో స్థానికులు నుంచి స్థానికుల నుంచి 9 దరఖాస్తులు అందాయి. వచ్చిన దరఖాస్తులు మొత్తం రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి.

వచ్చిన దరఖాస్తుల్లో భూ సంబంధిత సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. వచ్చిన దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం చూపాలన్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజావాణిలో డీఎల్‌పీఓ పుల్లారావు, లేబర్ ఆఫీసర్ రవి, ఏటీడబ్ల్యూఓ ఉపేందర్, డిప్యూటీ ఈఈ రంజిత్ నాయక్, సీడీపీఓ రేష్మ, మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ మోహన్, ఏవో రాంనర్సయ్య, ఎక్సైజ్ ఎస్ఐ శంకర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.