నిమిషాల్లో మారిన దృశ్యం..
- భూపాలపల్లి ఇకో పార్కులో వందల చెట్లు నేలమట్టం!
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భూపాలపల్లిలోని ఫారెస్ట్ ఉద్యానవనం ఇకో పార్కులో వందలాది చెట్లు నేలరాలగా, పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పార్కు దెబ్బతింది.
ఒక్కసారిగా మారిన వాతావరణంతో బలమైన గాలులు వీచి చెట్లు కూలిపోవడంతో ఇకో పార్కులో భారీ నష్టం జరిగినట్లు అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సోమవారం కావడంతో పార్కులో సందర్శకుల రద్దీ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. నష్టం వివరాలను అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తుండగా, పార్కు పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.


