పరిషత్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తాం

పరిషత్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తాం

  • ఝాన్సీ రెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ:
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి స్పష్టం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను హైదరాబాదులో కలిసిన ఆమె, శాలువాతో సత్కరించి బోకే అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లేందుకు నాయకులు కృషి చేయాలని తెలిపారు. పదవి అనేది బాధ్యత అని, నాయకులు ప్రజల్లో నిరంతరం ఉంటూ పనిచేయాలని సూచించారు.

అధిష్టానం సూచనల మేరకు పార్టీని మరింత బలమైన శక్తిగా మారుస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పాలన కార్పొరేట్ సంస్థలకే అనుకూలంగా ఉందని విమర్శించారు. పెట్రోల్ ధరల పెంపుతో ప్రజలపై భారం పెరిగిందని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తవుతున్నా కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని సకాలంలో తీసుకోకపోవడం వల్లే కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆమె అన్నారు. ఆ నెపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ప్రతిపక్షాల అన్ని కుట్రలను తిప్పికొట్టి పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను బలమైన శక్తిగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు.