అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం–2026 కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుకీర్తి తెలిపారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, అర్హులైన విద్యార్థులు జూలై 1 నుంచి ఆగస్టు 31, 2026 వరకు తెలంగాణ ఈ-పాస్ పోర్టల్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి షెడ్యూల్డ్ కులానికి (ఎస్సీ) చెందినవారై ఉండాలి. అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాలకు మించరాదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకుండా ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హుడు.
విదేశీ విద్య ప్రవేశానికి అవసరమైన పరీక్షల్లో TOEFLలో కనీసం 60, IELTSలో 6.0, GREలో 260 లేదా GMATలో 500 మార్కులు సాధించి ఉండాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లు, అడ్మిషన్ లెటర్, బ్యాంక్ పాస్‌బుక్‌తో పాటు అవసరమైన ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయం, ఐడీఓసీ (కలెక్టరేట్), భూపాలపల్లిలో సమర్పించాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుకీర్తి కోరారు.
