ప్రభుత్వ భూమి పరిశీలన, మీ సేవ కేంద్రం తనిఖీ
జిల్లా అదనపు రెవెన్యూ అధికారి కిషోర్ కుమార్ ఆదేశాలు
కుంటాల, ఆంధ్రప్రభ: ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు రెవెన్యూ అధికారి కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కుంటాల మండలంలోని అంబకంటి తండా, రాయపాడు తండా శివారులోని సర్వే నంబర్ 114లో ఉన్న 975 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూమికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ భూమిపై గ్రామస్తులు పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేపట్టినట్లు తెలిపారు.
అనంతరం కుంటాల మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. సేవల పేరుతో అదనపు రుసుములు వసూలు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత మీ సేవ కేంద్రాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆడే కామాక్షి, డిప్యూటీ తహసీల్దార్ కార్తీక్ రెడ్డి, ఆర్ఐలు రాజేశ్వర్, ఆడెల్లు, జీపీవో రాజకుమార్, పంచాయతీ కార్యదర్శి భోజన్న తదితరులు పాల్గొన్నారు.
