ఈ నెల 16 నుంచి స్వీయ గణన నగారా..
ఈ నెల 16 నుంచి స్వీయ గణన నగారా..
ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు ప్రక్రియ
కచ్చితమైన జనగణన డేటాకు వినూత్న కార్యాచరణ
ప్రతి ఒక్కరూ చైతన్యంతో భాగస్వాములు కావాలి
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : దేశ ప్రగతి పథానికి దిక్సూచి అయిన జన గణన – 2027లో తొలిదశలో భాగంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని.. ఇందులో ప్రజలు కీలకభాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ డా. జి.లక్ష్మీశ కోరారు. కలెక్టర్ లక్ష్మీశ బుధవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో జనగణనపై జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియతో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనగణనలో తొలిసారిగా ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని.. కచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజాభాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. https://se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరుచుకోవచ్చని.. దీనివల్ల సమయం ఆదాతో పాటు దోష రహితంగా కచ్చితమైన డేటా లభిస్తుందని వివరించారు.
ఈ విధానం వల్ల ఎన్యూమరేటర్ భౌతిక పరిశీలనకు వచ్చినప్పుడు స్వీయ గణన ద్వారా అందించిన డేటాను త్వరితగతిన ధ్రువీకరించేందుకు వీలవుతుందన్నారు. బిల్డింగ్ నంబరు, కుటుంబంలో మొత్తం సభ్యులు, ఇంటి యాజమాన్య స్థితి, తాగునీటికి ప్రధాన వనరు, ఇంటర్నెట్ సౌకర్యం, టీవీ సౌకర్యం ఇలా 34 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు స్వీయ గణన ద్వారా స్వచ్ఛందంగా అందించవచ్చన్నారు. అదేవిధంగా 15 రోజుల అవుట్‌రీచ్ క్యాంపయిన్‌లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో వర్గం లక్ష్యంగా స్వీయ గణనపై ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
ఏప్రిల్ 16న గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్‌పీ, ఎంపీపీ ఛైర్‌పర్సన్లు, జెడ్‌పీటీసీ, ఎంపీటీసీలను స్వీయ గణనలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 17వ తేదీన సచివాలయ సిబ్బంది, హెచ్‌వోడీ కార్యాలయాల సిబ్బంది, జిల్లా కార్యాలయాల సిబ్బంది, మండల కార్యాలయాల సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా ఏప్రిల్ 30 వరకు వివిధ వర్గాల ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
ఈ 15 రోజుల కార్యక్రమం సజావుగా సాగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీడియా పాత్ర కూడా కీలకమని పేర్కొన్నారు. స్వీయ గణనలో ప్రజలందరూ పాల్గొని జిల్లాను ముందువరుసలో నిలపాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. సమావేశంలో మెజిస్టీరియల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.వెంకట రామయ్య పాల్గొన్నారు.
