బాపట్లకు డిజిటల్ ముఖచిత్రం

  • ‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్‌సైట్‌కు కలెక్టర్ ప్రశంసలు..
  • విద్యార్థిని చాందిని శ్రీ ప్రతిభకు అభినందనలు..
  • ఆగస్టు 15 నాటికి సమగ్రంగా సిద్ధం చేయాలని ఆదేశం

బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా పర్యాటక, చారిత్రక విశేషాలతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేలా విద్యార్థిని రూపొందించిన ‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్‌సైట్ నమూనాను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అభినందించారు. జిల్లాకు డిజిటల్ ముఖచిత్రంగా నిలిచేలా వెబ్‌సైట్‌ను మరింత సమగ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.

చీరాల సెయింట్ ఆన్స్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ విభాగం చివరి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థిని విన్నకోట చాందిని శ్రీ రూపొందించిన ‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్‌సైట్ నమూనాను బుధవారం కలెక్టర్‌కు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వెబ్‌సైట్ నిర్మాణం, వినియోగ విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలను చాందిని శ్రీ వివరించింది.

ప్రజెంటేషన్‌ను పరిశీలించిన కలెక్టర్.. విద్యార్థిని ప్రతిభను ప్రశంసించారు. ప్రస్తుతం ఉన్న స్వర్ణ బాపట్ల పోర్టల్‌కు అనుసంధానమయ్యేలా కొత్త వెబ్‌సైట్‌ను మరింత సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. జీఎస్‌డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ యశ్వంత్ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రజల కోసం ప్రత్యేక వెబ్‌సైట్

కలెక్టర్ అప్పగించిన బాధ్యతను సవాల్‌గా స్వీకరిస్తున్నట్లు చాందిని శ్రీ తెలిపింది. కలెక్టర్ సూచనల మేరకు నెల రోజుల్లో సరికొత్త వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తానని పేర్కొంది. ప్రస్తుతం స్వర్ణ బాపట్ల వెబ్‌సైట్ జిల్లా ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉందని, తాను రూపొందిస్తున్న కొత్త వెబ్‌సైట్‌ను ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్ది స్వర్ణ బాపట్ల పోర్టల్‌తో అనుసంధానిస్తామని వివరించింది.

కొత్త వెబ్‌సైట్‌లో జిల్లా పర్యాటక ప్రాంతాలు, పండుగలు, చారిత్రక విశేషాలు, వసతి సౌకర్యాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. పౌరులు తమ ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తెలియజేసేందుకు కూడా ప్రత్యేక అవకాశం కల్పించనున్నట్లు చాందిని శ్రీ వివరించింది.

ఈ సందర్భంగా చాందిని శ్రీ తండ్రి విన్నకోట శ్రీనివాసరావు, తాతయ్య కె.ఎస్., మామయ్య వేజండ్ల శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జ్ఞాపికగా కలెక్టర్‌కు పెన్నును అందజేశారు.