బడుగు, బలహీన వర్గాల జోలికొస్తే తరిమికొడతాం..
- అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలకు డిమాండ్
- అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరిక
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అగ్రకుల అహంకారంతో బడుగు, బలహీన వర్గాల జోలికి వస్తే తరిమికొడతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌ను ఇటీవల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి దుర్భాషలాడి అవమానించారనే ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఎల్బీనగర్ పరిధిలోని చింతల్‌కుంటలో ఉన్న ఆమె నివాసానికి తలసాని వెళ్లి సంఘీభావం తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన యాదవ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎలాంటి స్వార్థం లేకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ప్రేమాభిమానాలు పొందిన ఈశ్వరమ్మ యాదవ్‌ను కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశ్వరమ్మ ఒంటరి కాదని, ఆమె వెంట బడుగు, బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు, అణగారిన వర్గాల ప్రజలు ఉన్నారని స్పష్టం చేశారు.
నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తలసాని డిమాండ్ చేశారు. తమ జోలికి వస్తే సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఆస్తులు, అంతస్తులు ఉన్నాయనే మదంతో, అగ్రకుల అహంకారంతో ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు.
‘‘మేం ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. మా వర్గాలు ఎంతో చైతన్యంగా ఉన్నాయి. మా సత్తా ఏంటో చూపిస్తాం’’ అని తలసాని హెచ్చరించారు. తాము మర్యాదగా నడుచుకోవాలని కోరుకుంటున్నామని, అయితే రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలపై ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా అక్కడకు చేరుకుని బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు.
ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సంబంధిత వ్యక్తులకు సూచించారు.

