అలుపెరగని పోరాటయోధుడు ముద్రగడ…
- కాపుల హక్కుల కోసం నిరంతర పోరాటం..
- పద్మనాభం మరణం తీరని లోటు..
- ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
- ముద్రగడ పద్మనాభంకు వైఎస్సార్సీపీ శ్రేణుల ఘన నివాళి
విజయవాడ, ఆంధ్రప్రభ : కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహాయోధుడు ముద్రగడ పద్మనాభం అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు బుధవారం వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నాయకులు ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని అన్నారు. సామాజిక న్యాయం, కాపు వర్గాల హక్కుల సాధన కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ప్రజల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని చెప్పారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పార్లమెంట్ కార్యదర్శులు తంగిరాల రామిరెడ్డి, ఆళ్ల చెల్లారావు, మాజీ కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవల్లిక, పుప్పాల కుమారి, కలపాల అంబేద్కర్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
