డా. కె.ఎల్.రావు ఆశయాలతో జలవనరుల అభివృద్ధి సాధించాలి

  • 125వ జయంతి సభలో వక్తల పిలుపు..
  • నదుల అనుసంధానం దేశాభివృద్ధికి కీలకమని అభిప్రాయం
  • అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రముఖ జల సాంకేతిక నిపుణుడు, మాజీ కేంద్ర మంత్రి, పద్మభూషణ్ డా. కె.ఎల్.రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని డా. కె.ఎల్.రావు భవన్‌లో “నదుల అనుసంధానం–నీటిపారుదల, విద్యుత్ రంగాల ప్రస్తుత స్థితి” అంశంపై నిర్వహించిన సభలో వక్తలు ఆయన సేవలను స్మరించుకున్నారు.

అక్కినేని భవానీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, డా. కె.ఎల్.రావు కుమారుడు కె. విజయరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు డా. ఎన్. తులసిరెడ్డి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

డా. కె.ఎల్.రావు దేశ జలవనరుల అభివృద్ధికి, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. గంగా–కావేరి నదుల అనుసంధాన పథకం ద్వారా వరదనీటిని కరువు ప్రాంతాలకు మళ్లించాలన్న ఆయన దూరదృష్టి నేటికీ ఆదర్శమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగు గంగ, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ వంటి సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా పూర్తి కాకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ, ప్రభుత్వం తక్షణమే తగిన నిధులు విడుదల చేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. యువత, ఇంజినీరింగ్ విద్యార్థులు డా. కె.ఎల్.రావు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇంజినీర్లు, మేధావులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.