ఒకటిన్నర నెల తర్వాత ఇన్‌చార్జి డీఈఓ నియామకం

  • పాఠశాలల ప్రారంభ వేళ కెప్టెన్ లేక విద్యాశాఖకు ఇబ్బందులు
  • చిత్తూరు పోస్టుకు పోటాపోటీ…
  • కృష్ణా జిల్లా నుంచి ఊహించని అధికారికి బాధ్యతలు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై ఒకటిన్నర నెల గడిచినా చిత్తూరు జిల్లాకు రెగ్యులర్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) నియామకం జరగకపోవడంతో విద్యాశాఖ పరిపాలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. గత నెలాఖరులో డీఈవో రాజేంద్రప్రసాద్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి కుర్చీ ఖాళీగానే ఉండిపోయింది.

తాత్కాలికంగా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ పూర్తి స్థాయి డీఈవో లేకపోవడంతో పర్యవేక్షణ, పరిపాలన, కీలక నిర్ణయాలు మందగించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కృష్ణా జిల్లా అంగలూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న కె. లక్ష్మీనారాయణను చిత్తూరు జిల్లా డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం జిల్లా విద్యాశాఖకు అత్యంత కీలకమైన కాలం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదు, డ్రాప్‌అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, విద్యా కిట్ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు, మౌలిక వసతుల పరిశీలన, ఉపాధ్యాయుల హాజరు, బోధనా ప్రమాణాల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలన్నింటికీ డీఈవో నాయకత్వం అత్యంత అవసరం.

అయితే గత ఒకటిన్నర నెలగా జిల్లా విద్యాశాఖకు పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో ఈ కార్యక్రమాల అమలుపై ప్రభావం పడినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో సాగలేదని సమాచారం.

ప్రతి సంవత్సరం జూన్ నెలలో మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి ప్రవేశాల లక్ష్యాలను నిర్దేశించే ప్రక్రియ ఈసారి మందగించింది. అలాగే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, ఇతర విద్యా సామగ్రి సరఫరా, పంపిణీపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తోంది.

ఏ పాఠశాలలో ఏ వస్తువులు అందాయి, ఎక్కడ కొరత ఉంది, ఎక్కడ పంపిణీ పూర్తికాలేదు వంటి అంశాలపై సమీక్షలు ఆలస్యమయ్యాయి. గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యాసంస్థలపై తనిఖీలు నిర్వహించడం, మండల విద్యాశాఖ అధికారులకు మార్గనిర్దేశం చేయడం, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల అమలు, పదో తరగతి పరీక్షల సమన్వయం వంటి కీలక బాధ్యతలు కూడా డీఈవో పరిధిలోనే ఉంటాయి.

పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో వేలాది మంది ఉపాధ్యాయులకు సంబంధించిన సేవా అంశాలు, సెలవులు, పదోన్నతులు, వేతనాలు, క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన పలు ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మండల విద్యాశాఖ అధికారులకు కూడా కీలక అంశాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు అందకపోవడంతో పనుల వేగం తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా డీఈవో పోస్టు కోసం పలువురు అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసినట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరిగింది.

గతంలో చిత్తూరు జిల్లాలో పనిచేసిన పురుషోత్తం, విజయేంద్ర రాములు, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం, అనంతపురం జిల్లా డీఈవో ప్రసాద్‌బాబు, కర్నూలు డైట్ సీనియర్ లెక్చరర్ అబ్దుల్ సాహెబ్, ప్రాంతీయ విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మొవ్వ గోవిందు పేర్లు బలంగా వినిపించాయి.

అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కృష్ణా జిల్లా అంగలూరు డైట్‌లో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న కె. లక్ష్మీనారాయణకు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రెగ్యులర్ డీఈవో నియామకం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం తాత్కాలికంగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించినప్పటికీ, చిత్తూరు వంటి పెద్ద జిల్లాకు శాశ్వత జిల్లా విద్యాశాఖ అధికారిని వీలైనంత త్వరగా నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. రెగ్యులర్ డీఈవో నియామకం జరిగితేనే విద్యాశాఖ పరిపాలనకు మరింత వేగం చేకూరి, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల అమలు సమర్థవంతంగా సాగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.