Munugode | తెలుగు ఉపాధ్యాయుడిని నియమించాలని వినతి

Munugode | తెలుగు ఉపాధ్యాయుడిని నియమించాలని వినతి
Munugode | మునుగోడు, ఆంధ్రప్రభ : నవంబర్ 25 నుండి నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయుడు లేక 10వ తరగతి విద్యార్థులు నష్టపోతున్నారని సర్పంచ్ గజ్జల ధనలక్ష్మి బాలరాజు గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గోసుకొండ రాధ, మాజీ విద్యా కమిటీ చైర్మన్ పూల వెంకటేశం ఆధ్వర్యంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ తాటి శ్రీనివాసులకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ… నవంబర్ 25 న జరిగిన సంఘటనలో సస్పెండ్ అయిన తెలుగు ఉపాధ్యాయుడిని తిరిగి మా పాఠశాలకే పంపించాలని, గతంలో జరిగిన సంఘటనతో గ్రామస్తులకు గాని విద్యార్థుల తల్లిదండ్రులకు గాని ఎలాంటి సంబంధం లేదని, అదే విధంగా సదరు ఉపాధ్యాయుని పని విధానం, అతని ప్రవర్తనలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు దృష్టిలో ఉంచుకొని వారి శ్రేయస్సు కొరకు ఆ ఉపాధ్యాయుని తిరిగి మా పాఠశాలలోనే కొనసాగేటట్లు చూడాలని జిల్లా విద్యాధికారిని విద్యార్థులు, గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు బొజ్జ వెంకన్న, పంతంగి వెంకన్న, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
