Telangana | ఖరారైన జగిత్యాల కాంగ్రెస్ టిక్కెట్లు.
Telangana | ఖరారైన జగిత్యాల కాంగ్రెస్ టిక్కెట్లు.
- కాంగ్రెస్ టికెట్ల విషయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ దే పైచేయి.
- జీవన్ వర్గీయుల్లో అసంతృప్తి.
- కొద్ది మంది అనుచరులకే దక్కిన టికెట్లు.
Telangana | జగిత్యాల, ఆంధ్రప్రభ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లను మంగళవారం ఉదయం ప్రకటించడంతో నిన్నటిదాకా సాగిన ఉత్కంఠకు తేరపడినట్లయింది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభ్యర్థిత్వమే పై చేయిగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో ఉన్న 50 కౌన్సిల్ అభ్యర్థులకు దాదాపు 20 వరకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అనుచరులకు పార్టీ టికెట్లు దక్కినట్లు తెలుస్తోంది. బీఫారాలు అందజేసేందుకు గడువు చివరి రోజు అయిన మంగళవారం ఉదయం పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో టికెట్లు దక్కని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొందరు తీవ్ర అసంతృప్తి లోనయ్యారు.
పార్టీలో ముఖ్య నాయకులుగా చెప్పుకుంటున్న నాయకులకు టికెట్లు దక్కకపోగా వారిలో అయోమయ పరిస్థితి నెలకొంది. జాబితాలో పేరు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆశావహ అభ్యర్థులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ కు చేరుకొని జగిత్యాల ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అనిశ్చితి వల్ల తామంతా తీవ్రంగా నష్టపోయినట్లు పార్టీ క్రియాశీల నాయకులు ఆందోళన చెందుతున్నారు.
