పెద్దజట్రంలో పోలీసుల ముఖాముఖి..

ఊట్కూర్ (ఆంధ్రప్రభ): గ్రామాల్లో ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని, రాబోయే పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలని మక్తల్ సీఐ రామ్‌లాల్, ఊట్కూర్ ఎస్సై రమేష్ కోరారు. శుక్రవారం ఎస్పీ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్ద జట్రం గ్రామంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించడం, రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అవగాహన కల్పించడం, మత్తుపదార్థాల నివారణ లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ వారి స్థితిగతులు, స్థానిక సమస్యలు, భద్రతా అంశాలు తెలుసుకున్నారు.

రాబోయే పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగేందుకు అందరూ సహకరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ సమయంలో ఎలాంటి వివాదాలు, అక్రమాలు, బెదిరింపులు గమనించినా… వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

గ్రామాల్లో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రజలంతా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎవరికైనా ఒత్తిడి, బెదిరింపులు, ప్రలోభాలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. గ్రామంలో సామరస్య వాతావరణం, పరస్పర గౌరవం, చట్టపరమైన అవగాహనపై సూచనలు చేశారు. గ్రామ ప్రజల సమస్యలను పై అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply