- సింగరేణితో అంబేద్కర్ యూనివర్సిటీ చర్చలు
- త్వరలో పూర్తి కార్యాచరణతో ఎం ఓ యు
సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సమీప గ్రామాలకు చెందిన అందరికీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యా అవకాశాలు అందిస్తూ అందరినీ విద్యలో పట్టభద్రులుగా తీర్చిదిద్దడానికి బృహత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఘంటా చక్రపాణి, సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచనపై కార్మికులను, వారి కుటుంబ సభ్యులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలపై శుక్రవారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో చర్చించారు.
సింగరేణి ఆధ్వర్యంలో అంబేద్కర్ యూనివర్సిటీ వారి నిర్వహణలో పెద్ద ఎత్తున విద్యా బోధనకు గల అవకాశాలపై చర్చించారు. త్వరలోనే సమగ్ర ప్రణాళిక రూపొందించి, అంబేద్కర్ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వారు తెలిపారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ మంచి పేరు సాధించిందని కార్మికులు, సమీప గ్రామాల ప్రజల విద్యాభివృద్ధికి తోడ్పడితే అది అన్నిటికన్నా పెద్ద సంక్షేమ కార్యక్రమం అవుతుందన్నారు.
సింగరేణి వ్యాప్తంగా బోధనకు అనుకూలమైన భవనాలను కేటాయిస్తే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు.
సింగరేణి వ్యాప్తంగా అందరినీ గ్రాడ్యుయేట్లుగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ప్రాజెక్టు ప్రభావిత, నిర్వాసిత ప్రజలకు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి కోర్సులు చదివేందుకు సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆర్థిక సహాయం అందించవచ్చన్నారు.
సింగరేణి ఛైర్మన్, ఎండీ శ్రీ ఎన్. బలరామ్ మాట్లాడుతూ… సింగరేణి కార్మికుల్లో కొందరు ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నప్పటికీ, ఎక్కువమంది హైస్కూల్, ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివి ఉన్నారని, పై చదువులు చదవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ అవకాశాలు లేక బాధ పడుతున్నారని, అటువంటి వారి కోసం అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా సింగరేణి వ్యాప్తంగా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి పై చదువులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశం సింగరేణి సంస్థకు ఉందని ఛైర్మన్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు చాలా మంది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పట్టాలను సాధించారని తెలిపారు.
తొలిసారిగా సింగరేణి సంస్థను సందర్శించిన వైస్ ఛాన్స్ లర్ ఘంటా చక్రపాణిని ఛైర్మన్, అధికారులు ఘనంగా సన్మానించారు. ఓపెన్ యూనివర్సిటీ నుండి రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి, డైరెక్టర్ (అకాడెమిక్) ప్రొఫెసర్ పుష్ప ఘంటా చక్రపాణి, డైరెక్టర్ (యూ జీ సీ-డీ ఈ బీ ఎఫైర్స్) ప్రొఫెసర్ పల్లవి కబ్దే, పీ ఆర్ ఓ డాక్టర్ వేణుగోపాల్, సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్.డి.ఎం.సుభాని, జీఎం (హెచ్ ఆర్ డి) రఘుపతి, జీఎం (మార్కెటింగ్) ఎన్.వి రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.