నావల్లో.. శవ యానం

బడి పిల్లల అగచాట్లు
మన్యంలో వీడని వరద
–చింతూరు(అల్లూరి జిల్లా) , ఆంధ్రప్రభ : అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరులో ఏజెన్సీలో గిరిజనం వరద కష్టాలు తీరడం లేదు. మన్యం జనం వరదలతో అష్టకష్టాలు పడుతున్నారు. ఇంట్లో నిత్యవసర సరుకులు లేవు. పిల్లలు బడికి వెళ్లాలంటే పిల్లలు పడవ ఎక్కాల్సిందే. వైద్యం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇక అత్యవసర స్థితిలో ఆసుపత్రులకు తీసుకువెళ్లటం, చనిపోతే మృతదేహాలను ఇంటికి తీసుకురావటానికి పడవలు దిక్కయ్యాయి. ఇవీ అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో గిరిజనం వరద కష్టాలు. మాములుగా వరదలొస్తే రెండు, మూడు రోజులు జనం భరించటం అలవాటే. మహాయితే ఐదు రోజులు ఇబ్బందులనూ పట్టించుకోరు. ఈ ఏడాది వరద 15 రోజులుగా పీడిస్తోంది. నేటీకి వరద వీడటం లేదు. గ్రామాల్లోకి ఈ వరద ప్రభావం కనిపించక పోయినా.. గ్రామాలను వరద నీరు చుట్టిముట్టటంతో జనానికి అవస్థలు మొదలైయ్యాయి. చింతూరు వద్ద శబరి నది నిలకడగా ఉంది. కేవలం ఒకటి రెండు పాయింట్లు మాత్రమే తగ్గి నిలకడగానే సాగుతోంది. సోమవారం రాత్రి 6 గంటల సమయానికి చింతూరు వద్ద శబరి నది 33 అడుగులకు చేరింది. ఉంది

. చింతూరు, వీఆర్ పురం , కూనవరం, ఏటపాక మండలాల్లోని రహదారులపై వరద నీరు చేరి ప్రయాణాలకు రహదారులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ మండలాల్లో సుమారు 60కి పైగా గ్రామాలకు దారులు లేక జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఆంధ్రా – ఒడిశా రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి 326 పై నిమ్మలగూడెం – కుయుగూరు గ్రామాల మధ్య రహదారి వరద నీరు అలానే ఉండటంతో అంతరాష్ట్ర రాకపోకలు స్థంభించాయి. ఈ వరదలతో మూడు మండలాల్లో పలు రహదారులపై వరద నీరు చేరడంతో దారులు లేకపోవడం ఆదివాసీలు అడవుల బాట పట్టి అడవుల్లోని కాలినడక మార్గాల ద్వారా మండల కేంద్రాలకు చేరుకొని అత్యవసర పనులు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఇంటర్ విద్యార్ధులు డిగ్రీలో చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వీఆర్ పురం మండలంలోని వడ్డిగూడెం గ్రామంలోని చిన్నారులు వీఆర్ పురం పాఠశాలకి వెళ్ళడానికి నానా అగచాట్లు పడుతున్నారు. వరద ఉండటంతో విద్యార్ధులు సైతం పడవలపై ప్రయాణించి పాఠశాలకు వెళ్ళాల్సిన దుస్థితి దాపురించింది. కాగా అటవీశాఖలో బీట్ అధికారి, సహాయ బీట్ అధికారి పోస్టుల భర్తీ నేపధ్యంలో గత రెండు రోజులు నుండి ఆన్ లైన్ లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ అవుతున్నాయి. ఈ హాల్ తీసుకొవడానికి అభ్యర్ధులు గ్రామాల నుంచి చింతూరు, వీఆర్పురం ప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర అందోళన చెందుతున్నారు.
పడవల్లోనే మృతదేహాల తరలింపు
మన్యంలో వరదలతో ఈ మధ్య గత రెండు మూడు రోజుల్లో మృతి చెందిన మృతదేహాల తరలింపులో గిరిజనం ముప్పు తిప్పలు పడుతున్నారు. ఈ మూడు రోజుల వ్యవధిలో కుంజవారిగూడెం, వీఆర్ పురం గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఇక రామవరం గ్రామానికి చెందిన కుంజా రాములమ్మ అనే మహిళ ఆనారోగ్యంతో బ్రెయిన్ డెడ్ కావటంతో.. ఆమెను ఇంటికి చేర్చటానికి భర్త పడవపై తీసుకువెళ్లటం పలువురిని కంట తడి పెట్టించింది.
