చేతివృత్తులు, హస్తకళలను ఆదరించాలి..
ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ప్రారంభించిన ఎమ్మెల్యే వెలగపూడి
పెదవాల్తేరు, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చేతివృత్తులు, హస్తకళలను ప్రజలు ఆదరించి ప్రోత్సహించాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిలుపునిచ్చారు.
సోమవారం పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన చేతివృత్తులు, హస్తకళలు, చేనేత వస్తువులను ఉత్పత్తి ధరలకే విక్రయిస్తున్నారని, అలాంటి కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు.
ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తులను ఒకేచోట ప్రదర్శించి విక్రయించడం వల్ల వినియోగదారులు తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ఈ బజార్‌ను ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చని తెలిపారు. నాణ్యమైన చీరలు, గృహోపకరణాలు, ఇతర అవసరమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయని, విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఎగ్జిబిషన్ నిర్వాహకులు, విశాఖ ఆర్టిసన్స్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు మొహమ్మద్ నసీం మాట్లాడుతూ, హైదరాబాద్ ముత్యాలు, కలంకారి పెయింటింగ్స్, రాజస్థాన్ బెడ్‌షీట్లు, బెంగాల్ కాటన్ చీరలు, కాటన్ డ్రెస్ మెటీరియల్, మైసూర్ రోజ్‌వుడ్ ఉత్పత్తులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన హస్తకళా వస్తువులను ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు.
ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని, నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలమాంబ ఆలయ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మద్ది శ్రీనివాస్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రహీమతుల్లా తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులు క్రాఫ్ట్ బజార్‌ను సందర్శించి నిర్వాహకులను అభినందించగా, నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు.
