Revanth Reddy | డీలిమిటేషన్ దక్షిణాదికి దగా!

Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఎంతలా నష్టపోతాయో గణాంకాలతో సహా వివరించారు.
దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష..
సాధారణంగా డీలిమిటేషన్ అనేది ‘జనాభా’ ప్రాతిపదికన జరుగుతుంది. గత దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభాను అదుపులో ఉంచాయి. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు జనాభా ఆధారంగా సీట్లు పెంచితే, జనాభాను నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధించినట్లు అవుతుందని, పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం గణనీయంగా పడిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
లెక్కలతో సహా చేప్పిన సీఎం రేవంత్ రెడ్డి..
ఉత్తరాది, దక్షిణాదిలో సమానంగా 50 శాతం చొప్పున చట్టసభల సీట్లు పెంచినా సరే, రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం (గ్యాప్) భారీగా పెరిగిపోతుందని రేవంత్ రెడ్డి ఒక ఉదాహరణ ద్వారా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కి లోక్‌సభలో 80 స్థానాలు ఉన్నాయి. 50% పెంపు జరిగితే ఆ సంఖ్య 120కి చేరుకుంటుంది. తెలంగాణకి లోక్‌సభలో 17 స్థానాలు ఉన్నాయి. 50% పెంపు జరిగితే ఆ సంఖ్య 26కి మాత్రమే పెరుగుతుంది. ప్రస్తుతం యూపీకి, తెలంగాణకి మధ్య లోక్‌సభ సీట్ల వ్యత్యాసం 63 (80 మైనస్ 17)గా ఉంది. అదే సీట్ల పెంపు తర్వాత ఈ వ్యత్యాసం ఏకంగా 94 (120 మైనస్ 26)కి చేరుకుంటుంది.
బలహీనంగా దక్షిణాది వాయిస్..
సీట్లు ఎంత శాతంలో పెంచినా, బేస్ నంబర్ (ప్రస్తుత సీట్లు) ఉత్తరాదికి ఎక్కువగా ఉండటం వల్ల సంఖ్యాపరంగా వారు మరింత బలపడతారు. దీని వలన జాతీయ రాజకీయాల్లో, ప్రభుత్వాల ఏర్పాటులో ఉత్తరాది రాష్ట్రాల (ముఖ్యంగా యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల) ఆధిపత్యం మరింత పెరుగుతుంది. “ఇప్పటికే బలహీనంగా ఉన్న దక్షిణాది వాయిస్, ఈ డీలిమిటేషన్ తర్వాత అత్యంత బలహీనంగా మారుతుంది” అని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. జాతీయ అభివృద్ధికి అత్యధిక పన్నులు చెల్లిస్తూ, జనాభాను నియంత్రిస్తూ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ గణాంకాల ద్వారా పరోక్షంగా డిమాండ్ చేశారు.
