డీసీసీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్థిక అక్షరాస్యతతో గ్రామీణ ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలి: మేనేజర్ పూర్ణచందర్
తొర్రూరు, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంత ప్రజలు డీసీసీ బ్యాంకు అందిస్తున్న వివిధ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీ బ్యాంకు మేనేజర్ ఎం. పూర్ణచందర్ కోరారు.
డీసీసీబీ తొర్రూరు శాఖ ఆధ్వర్యంలో, నాబార్డ్ సహకారంతో శుక్రవారం మండలంలోని వెలికట్ట గ్రామంలో స్థానిక సర్పంచ్ బంధు శ్రీనివాస్ అధ్యక్షతన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పూర్ణచందర్ మాట్లాడుతూ, బ్యాంకు ప్రవేశపెట్టిన ‘రాణి రుద్రమ’ డిపాజిట్ పథకం కింద ఖాతాదారులకు గరిష్ఠంగా 8.10 శాతం వడ్డీ అందిస్తున్నట్లు తెలిపారు.
రైతుల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక రుణాలతో పాటు బర్రెలు, గొర్రెలు, ట్రాక్టర్లు, కార్లు, హార్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు రుణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే హౌసింగ్, విద్యా రుణాలు కూడా అందిస్తున్నామని, రైతులు, మహిళా సభ్యులు ఈ రుణాలను పొందవచ్చని తెలిపారు.
ప్రస్తుత సాంకేతిక యుగానికి అనుగుణంగా ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, లాకర్ సదుపాయాలతో పాటు ప్రమాద బీమా వంటి సేవలను కూడా బ్యాంకు అందిస్తోందన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అల్లంనేని అనిల్రావు, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణకాంత్, కళాజాత బృందం నిర్వాహకులు వై. రమేష్, బ్యాంకు సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
