మూత్రపిండాలు, కాలేయ వ్యాధులకు యశోదలో అత్యాధునిక చికిత్స
రోబోటిక్ అవయవ మార్పిడి సేవలు అందుబాటులో.. ముందస్తు పరీక్షలతో వ్యాధులను నివారించొచ్చు: వైద్య నిపుణులు
నర్సాపురం, ఆంధ్రప్రభ : మూత్రపిండాలు, కాలేయ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే అవయవ వైఫల్యాన్ని చాలా వరకు నివారించవచ్చని యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు తెలిపారు. శుక్రవారం నర్సాపురంలోని మల్లిపూడి ప్లాజాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డా. శశికిరణ్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. లలిత్ కుమార్ రెడ్డి కాంతాల ఈ వివరాలు వెల్లడించారు.
డా. శశికిరణ్ మాట్లాడుతూ, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, కుటుంబంలో కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కిడ్నీ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మూత్రపిండాల వ్యాధులు చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు లేకుండానే నిశ్శబ్దంగా పురోగమిస్తాయని, అందువల్ల ముందస్తు పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతో కీలకమని పేర్కొన్నారు.
యశోద హాస్పిటల్స్‌లో ప్రపంచస్థాయి సాంకేతికతతో అత్యాధునిక హీమోడయాలసిస్, కంటిన్యూయస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ (సీఆర్ఆర్టీ), థెరప్యూటిక్ ప్లాస్మాఫెరెసిస్, హీమోపర్ఫ్యూషన్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే చివరి దశ కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న వారికి లివింగ్ డోనర్ కిడ్నీ మార్పిడులతో పాటు ఏబీఓ, హెచ్ఎల్ఏ ఇన్‌కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంపిక చేసిన రోగులకు రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.
డా. లలిత్ కుమార్ రెడ్డి కాంతాల మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని మలక్‌పేట్ యశోద హాస్పిటల్స్‌లో ప్రత్యేక కాలేయ మార్పిడి విభాగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కాలేయ సిరోసిస్, కాలేయ క్యాన్సర్, మెటబాలిక్ లివర్ వ్యాధులకు సమగ్ర చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అత్యాధునిక రోబోటిక్, లాపరోస్కోపిక్ సాంకేతికతతో కాలేయ మార్పిడి, దాతల శస్త్రచికిత్సలు నిర్వహించడం వల్ల తక్కువ కోతలు, తక్కువ నొప్పి, వేగంగా కోలుకునే అవకాశం రోగులకు లభిస్తుందని వివరించారు.
ప్రీ-ట్రాన్స్‌ప్లాంట్ మూల్యాంకనం నుంచి శస్త్రచికిత్స అనంతర ఫాలోఅప్ వరకు ఒకే వేదికపై సేవలు అందిస్తున్నామని, హెపటాలజిస్టులు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్ బృందంతో కూడిన బహుళ విభాగాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కిడ్నీ, కాలేయ వ్యాధులు ముదిరే వరకు లక్షణాలు కనిపించకపోవచ్చని, అధిక బరువు, మధుమేహం, వైరల్ హెపటైటిస్ ప్రమాదం ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచించారు.
ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్ర, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
