ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ఫారాలు సమర్పించాలి
- తహసిల్దార్ గడీల శ్రీనివాస్
తొర్రూరు, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని తహసిల్దార్ గడీల శ్రీనివాస్ సూచించారు.
గురువారం మండల వ్యాప్తంగా ప్రారంభమైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) సర్వే ప్రక్రియను ఆయన నాంచారిమడూరు గ్రామంలో పరిశీలించారు. సర్పంచ్ బంగారు రమేష్, పంచాయతీ కార్యదర్శి ఉపేందర్‌లతో కలిసి పలు ఇళ్లను సందర్శించి దరఖాస్తు ఫారాల పంపిణీ విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, ప్రతి ఓటరు తప్పనిసరిగా దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి బీఎల్వోలకు అందజేయాలని తెలిపారు. జులై 24 వరకు సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు.
రెండు రోజుల తర్వాత బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులను సేకరిస్తారని తెలిపారు. ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే 1950 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఒకవేళ బీఎల్వోలు ఇంటికి రాకపోయినా అదే నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీటీ నరసయ్య, ఆర్ఐ విక్రమ్, బీఎల్వోలు నలమాస రాజ్‌కుమార్, యాకలక్ష్మి, మంద విజయలక్ష్మి, జీపీఓ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
