భారీ వర్షాలకు కుప్పకూలిన వృద్ధురాలి గుడిసె….
క్యాతనపల్లి, ఆంధ్రప్రభ: క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు శ్రీనివాస్‌నగర్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ వృద్ధురాలి గుడిసె పూర్తిగా కూలిపోయింది. దీంతో ఆమె నిరాశ్రయురాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
శ్రీనివాస్‌నగర్‌కు చెందిన పాశం భూదమ్మ (భర్త గౌరయ్య, మృతి) గత 40 సంవత్సరాలుగా చిన్న గుడిసెలో నివాసం ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి ఆమె నివాసం ఒక్కసారిగా కుప్పకూలింది. గుడిసె ఒకవైపు గోడ పూర్తిగా కూలిపోగా, పైకప్పు దూలాలు, రేకులు కూడా నేలకూలాయి.

ప్రస్తుతం తలదాచుకునేందుకు కనీస ఆశ్రయం కూడా లేక భూదమ్మ తీవ్ర ఆందోళనలో కాలం గడుపుతోంది. కూలిపోయిన గుడిసెను తిరిగి నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేక ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు నివాసయోగ్యమైన ఇంటిని మంజూరు చేయాలని భూదమ్మ విజ్ఞప్తి చేసింది. వృద్ధురాలికి వెంటనే సహాయం అందించి న్యాయం చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
