మొక్కలు నాటి… పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మొక్కలు విరివిగా నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఊట్కూర్ మండల విద్యాశాఖ అధికారిణి మాధవి, ఎస్సై రమేష్ అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని రిషి బ్రైట్ కిడ్స్ పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన హరిత కార్యక్రమంలో విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రజా సంస్థలకు మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈవో మాధవి మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు కురవడం లేదని వాతావరణ సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని సూచించారు. మొక్కలు మనకు ప్రాణవాయువును అందించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమన్నారు.
ఎస్సై రమేష్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం అభినందనీయమని పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. సమాజం మొత్తం కలిసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పాఠశాల ప్రిన్సిపల్ గొల్ల విశాల్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుతెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు కిడ్స్ పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
