భారీ పోలీస్ కార్డెన్ సెర్చ్…

భారీ పోలీస్ కార్డెన్ సెర్చ్…

26 ద్విచక్ర వాహనాలు, 12 మారణాయుధాలు స్వాధీనం…

చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీ, సంజీవ్ నగర్ ప్రాంతాల్లో సోమవారం వేకువజామున పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 26 ద్విచక్ర వాహనాలు, 12 మారణాయుధాలు స్వాధీనం చేసుకుని, 7 మంది రౌడీ షీటర్లు, మరో 7 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

తనిఖీలు…

డీఎస్పీ హనుమంతరావు, అర్బన్ సీఐ పి. రమేష్ ఆధ్వర్యంలో 90 మంది పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో నేర నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలలో భాగంగా ఆది ఆంధ్ర కాలనీ, సంజీవ్ నగర్ ప్రాంతాల్లో ఆకస్మికంగా కార్డెన్ సెర్చ్ చేపట్టారు.ఇంటింటి తనిఖీల్లో భాగంగా చట్టవిరుద్ధంగా నిల్వ ఉంచిన 12 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పత్రాలు లేని లేదా అనుమానాస్పదంగా ఉన్న 26 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నేర చరిత్ర కలిగిన 7 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు, అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో 7 మందిని విచారణ నిమిత్తం తరలించారు.

డీఎస్పీ హనుమంతరావు హెచ్చరిక…

ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు లోనవకుండా తల్లిదండ్రులు పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే 100, 112 లేదా సమీప పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా శాంతి భద్రతల నిమిత్తం తనిఖీలు జరిపినట్లు ఇకముందు కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు

హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన….

రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డీఎస్పీ సూచించారు. హెల్మెట్ ప్రాణాలను రక్షించే ముఖ్య సాధనమని, ప్రమాద సమయంలో తలకు గాయాలు కాకుండా కాపాడుతుందని చెప్పారు.
బెంగళూరు, హైదరాబాద్ వంటి పట్టణాల్లో హెల్మెట్ వినియోగం పెరిగిందని, ప్రజలు అవగాహనతో ముందుకు వస్తున్నారని తెలిపారు. చిలకలూరిపేట పట్టణానికి వివిధ గ్రామాల నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై పట్టణంలో హెల్మెట్ తప్పనిసరి చేస్తామని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమము నాదెండ్ల ఇన్చార్జిగా జై నిరంజన్ IPS ఆధ్వర్యంలో ట్రైనింగ్ డి.ఎస్.పి జయకృష్ణ, నరసరావుపేట డిఎస్పి యం హనుమంతరావు, టౌన్ సీఐ పి. రమేష్, ఎస్సైలు సోమేశ్వరరావు, హజరత్తయ్య, చెన్నకేశవులు, చిలకలూరిపేట రూరల్ ఎస్సైలు జి అనిల్ కుమార్, లేఖ ప్రియాంక, యడ్లపాడు SI శివరామ కృష్ణ నరసరావుపేట వన్ టౌన్, టూ టౌన్ మరియు రూరల్ సిఐలు, si లు మరియు ఏఎస్ఐలు, మహిళా ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళు, ఇతర పోలీస్ సిబ్బంది మొత్తం 97 మంది సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించినారు.