యోగాతో ఒత్తిడిని జయించి.. సేవా సామర్థ్యాన్ని పెంచాలి
యోగాతో ఒత్తిడిని జయించి.. సేవా సామర్థ్యాన్ని పెంచాలి
సిబ్బందితో కలెక్టర్ లక్ష్మీశ యోగా సాధన
ఆరోగ్యవంతమైన సిబ్బందే సురక్షిత సమాజానికి పునాది
విజయవాడ, (ఆంధ్రప్రభ): సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో వివిధ వర్గాల కోసం ప్రత్యేక థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
సోమవారం విజయవాడ అర్బన్ పరిధిలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ విపత్తు స్పందన దళాలు, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్తులు, అగ్నిప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించే అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బందికి యోగా అత్యంత అవసరమన్నారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడిని అధిగమించడం, సమర్థవంతంగా విధులు నిర్వహించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. యోగా శరీరానికే కాకుండా మనసుకు కూడా ప్రశాంతతను అందించి సేవా సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని చెప్పారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2026 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, అగ్నిమాపక శిక్షణ కేంద్రం ఇన్‌స్ట్రక్టర్ వహీద్ ఖాన్, జిల్లా ఆయుష్ అధికారి డా. వై. రత్నప్రియదర్శిని, జిల్లా యువజన సంక్షేమ అధికారి డా. కొల్లేటి రమేష్, వీఎంసీ అదనపు కమిషనర్ డా. డి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
