ఉడుంపూర్‌లో వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

భక్తుల రద్దీ మధ్య పూర్ణాహుతి, మహా మంగళహారతి

కడెం (ఆంధ్రప్రభ): కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి (శీతల దేవి) ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయ ప్రధాన అర్చకులు కాకర నరేంద్ర శర్మ బృందం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి స్థిరయంత్ర ప్రతిష్ఠాపన, విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి, మహా మంగళహారతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

పూజా కార్యక్రమాల్లో గ్రామస్తులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా, ఉపసర్పంచ్ నాగవత్ సరిత, ప్రభాకర్, జీపీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, గ్రామస్థులు, దాతలు పాల్గొన్నారు.