CM Revanth | 2034 నాటికి ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం

CM Revanth | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలులో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతదేశ అత్యాధునిక నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ జీవన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని పేర్కొన్న సీఎం, అయితే నగరాన్ని కాలుష్య సమస్య వేధిస్తోందని అన్నారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

పరిశ్రమలను నగర పరిధి వెలుపలకు విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) అవతల పరిశ్రమలకు భూములు కేటాయిస్తామని, ఓఆర్‌ఆర్–రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య విస్తృత పారిశ్రామిక మండలాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ వెలుపల వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, 2047 నాటికి దాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించేందుకు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం ఆధునిక నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను ప్రభుత్వం విస్తృతంగా అమలు చేస్తోందని చెప్పారు.