CM Chandrababu Naidu | రైతులకే భూమిపై పూర్తి హక్కు
CM Chandrababu Naidu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అవినీతిరహిత పాలనను అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని చెప్పారు. ప్రజల ఆస్తిపై పూర్తి అధికారం వారికే ఉండాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. భూమి సంబంధిత సమస్యలన్నింటికీ పారదర్శకంగా పరిష్కారం చూపిస్తున్నామని, దళారుల ప్రమేయం లేకుండా గ్రామసభల్లోనే పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల వల్ల లక్షలాది కుటుంబాలు నష్టపోయాయని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించిందని చంద్రబాబు విమర్శించారు. రైతుల భూ హక్కులను మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గత ఏడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసినట్లు వెల్లడించిన సీఎం, భూ రికార్డుల్లో పారదర్శకత, భద్రత కోసం బ్లాక్‌చెయిన్ సాంకేతికతను ప్రవేశపెట్టామని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో భూ రికార్డులను మరింత విశ్వసనీయంగా మార్చి, భూములపై వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
