సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేయాలని పిలుపు

సూర్యాపేట, ఆంధ్రప్రభ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు.

శనివారం సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన వెలుగు వెంకన్నతో పాటు రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులను తన నివాసంలో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదని అన్నారు. మండలాలతో పోలిస్తే పట్టణంలో పార్టీకి ఓటు శాతం తక్కువగా నమోదవుతోందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈసారి పట్టణంలోని ప్రతి వార్డులో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి, ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ వచ్చేలా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

వెలుగు వెంకన్న వివాదరహితుడు, అంకితభావంతో పనిచేసే నాయకుడని పేర్కొన్న పటేల్ రమేష్ రెడ్డి, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, గత మున్సిపల్ ఎన్నికల్లో నాయకులంతా ఐక్యంగా పనిచేయడం వల్లే కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అంతర్గత విభేదాల కారణంగానే బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి విజయం సాధించారని విమర్శించారు. ఈసారి అన్ని వర్గాలు ఐక్యంగా పనిచేసి సూర్యాపేటను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రమణారెడ్డి, నేరెళ్ల మధు, బెల్లంకొండ శ్రీరాములు, బంటు చొక్కయ్యలను ఘనంగా సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, బైరబోయిన శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, ఫారూక్, పాలగాని కృష్ణ, నాయకులు నిమ్మల వెంకన్న, దొంతిరెడ్డి సైదిరెడ్డి, వల్దాసు దేవేందర్, ధర్మా నాయక్, రంగారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.