అమరవీరుల ఆశయాలను సాధించాలి

అమరవీరుల ఆశయాలను సాధించాలి
గరిడేపల్లి, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన ఆశువులు బాసిన అమరవీరుల ఆశయాలను సాధించాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య కోరారు. మండలంలోని వెలిదండ గ్రామంలో సోమవారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ సీనియర్ నాయకులు, అఖిల భారత రైతు కూలీ సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు వీసాల గోవిందు 14వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవోద్యమాలకు పురిటిగడ్డగా, కమ్యూనిస్టు పోరాటాలకు కంచుకోటగా ఉన్న వెలిదండ గ్రామంలో జన్మించిన వీసాల గోవిందు పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఈ ప్రాంత ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర వహించారని తెలిపారు. ఎర్రజెండా ఉద్యమాల్లో, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాల నిర్వహిస్తున్న సమయంలో బూర్జువా పాలకవర్గ ప్రభుత్వాలు ఎన్ని నిర్బంధాలు విధించిన, దాడులు చేసిన, చిత్రహింసలు పెట్టినప్పటికీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగారని ఆయన కొనియాడారు.
ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుటి నిలిచి విప్లవ బావుటాకు ద్రోహం చేయకుండా తాను నమ్మిన బాటలో తుది వరకు పయనించి అస్తమించిన వీసాల గోవిందు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. నేటి సమాజంలో గతాన్ని చరిత్రను మరచి గాలివాటానికి కొట్టుకుపోతున్న తరం వీసాల గోవిందు లాంటి అనేకమంది వీరుల త్యాగాల సాక్షిగా ఆలోచనలు చేసి ఆదర్శవంతమైన అడుగులను వేయాలని ఆయన కోరారు. అంతకుముందు వీసాల గోవింద స్తూపం వద్ద మాజీ సర్పంచ్ పార్టీ సీనియర్ నాయకులు మా శెట్టి అంజయ్య జండా ఆవిష్కరణ చేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో గ్రామ పార్టీ కార్యదర్శి మేకల కనకారావు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కామళ్ళ నవీన్, పార్టీ సీనియర్ నాయకులు చనగాని సాంబయ్య, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కామల్ల శ్రీను, అరుణోదయ జిల్లా నాయకులు గండు నాగేష్, చింతమల్ల అంజయ్య, కారంగుల నరేష్, అలవాల శ్రీను, పర్వతాలు, నగేష్, బ్రహ్మయ్య, మల్లయ్య, రాంబాబు, పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు మేకల రాజేశ్వరి, పోటు శ్రీహరి, తాళ్లూరి సూర్యం, నెమ్మాది బిక్షం, పోటు మంగమ్మ, జిలకర ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
