College | సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన

College | సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
College | మహబూబ్ నగర్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా జడ్చర్ల మండలం చిట్టి బోయిన్పల్లి గ్రామంలో త్రిబుల్ ఐటీ కళాశాల భూమి పూజ, క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నేటి బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నేం శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ (MP) డాక్టర్ మల్లురవి, మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ చైర్మన్ ఓబేధుల్లా కొత్వాల్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రారంభోత్సవాలు చేయనున్న కార్యక్రమాల ఏర్పాట్లను సంబంధిత శాఖ అధిపతులతో కలిసి పరిశీలించి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది.

జోగులాంబ జోన్–7 డీఐజీ ఎల్.ఎస్. చౌహన్ ఆధ్వర్యంలో, శంకుస్థాపన, సభా ప్రాంగణాలు, ప్రయాణ మార్గాలు, పరిసర ప్రాంతాల్లో సమర్థవంతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ (Trafic) అంతరాయం నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ బందోబస్తు విధుల్లో ఒక ఎస్పీ, ఏడుగురు అదనపు ఎస్పీలు, పది మంది డీఎస్పీలు, 34 మంది సీఐలు, 77 మంది ఎస్సైలు, 182 మంది ఏఎస్ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు, 741 మంది పీసీలు,వుమెన్ పీసీలు, 110 మంది హోంగార్డులు సహా మొత్తం 1184 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఏఎస్ఎన్ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో డీఐజీ (DIG) ఎల్.ఎస్. చౌహన్ అధికారులకు సమగ్ర సూచనలు అందిస్తూ, ప్రజల ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ సజావుగా కొనసాగేలా, వీఐపీ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల బహిరంగ సభ మైదానంలో కార్యక్రమానికి వచ్చే వివిఐపీలు, ప్రత్యేక ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మహిళలు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు అధికారులు. ముందస్తుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి జడ్చర్ల చిట్టి బోయినపల్లి వరకు పోలీసులు పకడ్బందీ ట్రాఫిక్ వ్యూహాన్ని అనుసరిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.
