ఖరీఫ్ సాగుకు పటిష్ట చర్యలు
ఖరీఫ్ సాగుకు పటిష్ట చర్యలు
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ నాగరాణి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో ఖరీఫ్-2026 పంట సాగుకు రైతులకు అవసరమైన సాగునీటిని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా నీటిపారుదల సలహా మండలి చైర్‌పర్సన్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి ఖరీఫ్ 2026-27 సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. సమావేశానికి భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజల స్పందన ఆధారంగా నీటిపారుదల శాఖకు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం రావడం గర్వకారణమన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.
కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనుల పురోగతిపై ఇరిగేషన్ సర్కిల్ వారీగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ముఖ్యంగా షట్టర్ల మరమ్మతులను అత్యవసరంగా చేపట్టాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ప్రధాన, ఉప కాలువలను నీటి ప్రవాహానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు.
జిల్లాలో 18 ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు గుర్రపు డెక్కతో కంపోస్టు తయారీ చేపట్టడం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కేంద్రాలను నీటిపారుదల శాఖ అధికారులు సందర్శించి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
మున్సిపల్ డ్రైనేజీ నీరు, ఇతర వ్యర్థాలు పంట కాలువల్లో కలవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్య నియంత్రణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, రైతులకు నిరంతర సాగునీటి సరఫరా కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్య అంశమని చెప్పారు. మున్సిపల్ డ్రైనేజీ నీటిని నేరుగా పంట కాలువల్లోకి వదలడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
దీని వల్ల తాగునీటి వనరులు, పర్యావరణం కలుషితమవడంతో ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. డెల్టా ప్రాంతంలో కాలుష్య ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని, దీనిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
తాగునీటి వనరుల పరిరక్షణ, పర్యావరణ కాలుష్య నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, పంట కాలువల్లోకి డ్రైనేజీ నీరు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కె. మురళీకృష్ణరాజు, వైస్ చైర్మన్ గుబ్బల మార్రాజు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
అలాగే నీటిపారుదల శాఖ ఎస్‌ఈ దేవ ప్రకాష్, ఈఈ యు. రమేష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, నరసాపురం సబ్ డివిజన్ డీఈ సీహెచ్ వెంకటనారాయణ, తణుకు సబ్ డివిజన్ డీఈ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డీఈ కె. ధర్మజ్యోతి, భీమవరం డ్రైన్స్ ఈఈ సత్యనారాయణ, జేఈలు, ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.
