జాతీయ రహదారి పనులతో దుమ్ము దుమారం..

జాతీయ రహదారి పనులతో దుమ్ము దుమారం..
- ఇబ్బందులు పడుతున్న నర్సింగపూర్, బెజ్జల గ్రామస్తులు
జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల కారణంగా నర్సింగపూర్, బెజ్జల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మాణం కోసం మట్టిని పోసిన అనంతరం రోడ్లపై నీరు చల్లకపోవడంతో గాలులకు విపరీతంగా దుమ్ము ఎగసిపడుతోంది.
దుమ్ము కారణంగా ఇళ్లలోకి మట్టి చేరుతుండటంతో పాటు ప్రజలు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతున్నప్పటికీ, రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న మేఘా కంపెనీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మండల అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దుమ్ము నివారణకు చర్యలు చేపట్టాలి
జాతీయ రహదారి పనుల వల్ల భారీగా దుమ్ము వ్యాపిస్తోందని నర్సింగపూర్, బెజ్జల గ్రామాల ప్రజలు తెలిపారు. ఇళ్లలోకి దుమ్ము చేరుతుండటంతో చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
మేఘా కంపెనీ అధికారులు, సంబంధిత మండల అధికారులు వెంటనే స్పందించి మట్టి రహదారులపై క్రమం తప్పకుండా నీరు చల్లడంతో పాటు దుమ్ము నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
