కలెక్టర్ తనిఖీతో ఆసుపత్రిలో మెరుగైన పారిశుద్ధ్య పనులు

మోత్కూర్, ఆంధ్రప్రభ: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీతో మోత్కూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు మెరుగుపడ్డాయి. వాటర్ సంప్ శుభ్రపరచడంతో పాటు ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు.

జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం సాధారణమే. ఈ క్రమంలో మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆసుపత్రిలో అపరిశుభ్రతపై అధికారుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక మున్సిపల్ కమిషనర్ గోలుకొండ నర్సయ్యకు ఫోన్ చేసి ఆసుపత్రిలోని వాటర్ సంప్‌ను శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకురావాలని, ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించాలని ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందించిన కమిషనర్ నర్సయ్య శనివారం క్షేత్రస్థాయిలో మున్సిపల్ సిబ్బందితో పనులు చేయించారు. వాటర్ సంప్ క్లీనింగ్‌తో పాటు ఆసుపత్రి ఆవరణలో చెత్తాచెదారం తొలగించి పారిశుద్ధ్య పనులను పూర్తి చేశారు.

జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని స్థానిక ప్రజలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. పచ్చదనం, పరిశుభ్రతపై కేవలం ఫ్లెక్సీలు, అవగాహన ర్యాలీలు, సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి అధికారుల తనిఖీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.